డిసెంబర్ రెండవ వారంలోపు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు అనంతరం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో ఎంపీడీఓ కార్యాలయం లో నిర్వహించిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలోపాల్గొన్నారు లక్ష్మణ్.. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఎన్నికల షెడ్యూల్‌పై అనవసర సందేహాలు వద్దని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించినట్లుగానే పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.
బీసీలకు పార్టీపరంగా 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ డిసెంబర్లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని రాష్ట కేబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ లోనే పంచాయతీ ఎన్నికలు పూర్తిచేయాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. దీంతో మరో వారం, పది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది.
కేంద్ర ప్రభుత్వం వద్ద, కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశం ఇప్పట్లో తేలే అవకాశం లేకపోవడం, మార్చి లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి వచ్చే రూ. 3 వేల కోట్ల నిధులు మురిగిపోయే ప్రమాదం ఉన్నందున కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుందని మీడియాకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
